మధుసూదన్‌ కుటుంబానికి తోడుగా ఉంటాం

 మధుసూదన్‌ కుటుంబానికి తోడుగా ఉంటాం

- రాష్ట్ర ప్రభుత్వం తరఫున 10 లక్షల చెక్కు అందజేసిన ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

- ఉగ్రవాదంపై చర్యలకు కేంద్రం సిద్ధం అవుతోంది.

- ఎంపీ వేమిరెడ్డి

ఉగ్రవాద దాడిలో మృతి చెందిన కావలి పట్టణానికి చెందిన మధుసూదన్ కుటుంబ సభ్యులను నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, నుడా ఛైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి గారు ఆదివారం పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి పది లక్షల చెక్కును  కావలి ఆర్డిఓ వంశీకృష్ణ ఆధ్వర్యంలో నేతలు అందజేశారు. కుటుంబ పరిస్థితిని తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. 

ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు మాట్లాడుతూ.. దేశంలో ఉగ్రవాద దాడి జరగడం దురదృష్టకరమన్నారు. దాడిలో కావలికి చెందిన మధుసూదన్‌ మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ స్థితిగతులను పరిశీలించామని, తప్పకుండా ప్రభుత్వం తరఫున తగిన న్యాయం చేస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన 10 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు.. కేంద్ర ప్రభుత్వం తరఫున వారికి అందాల్సిన సదుపాయాలను అందజేసే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే కుటుంబంలో ఒకరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా తాము ప్రయత్నిస్తామని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలకు మేమంతా కట్టుబడి ఉంటామని, పాకిస్తాన్‌పై ప్రతీకారం తీసుకునేందుకు కేంద్రం చూస్తోందన్నారు. ఇప్పటికే సింధూ జలాలను నిలిపివేసిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబంలో పిల్లల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. 

ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మాట్లాడుతూ..ఉగ్రవాద దాడులు జరగడం దురదృష్టకరమని, మధుసూదన్ రావు మృతి చెందడం కుటుంబానికి తీరని లోటన్నారు. మధుసూదన్ కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం తరఫున 10 లక్షలు చెక్కును అందజేశామని చెప్పారు. పాకిస్తాన్ చర్యలను ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఎదుర్కొందామని, ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు భారతదేశం ఏకం అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. కని పెంచిన తల్లి,తండ్రులకు వృద్దాప్యం లో చేదోడు గా ఉండాలని విదేశాల్లో ఉన్నత కొలువులను సైతం వదులుకొని వచ్చిన మధుసూదన్ ముష్కరుల బారిన పడి ప్రాణాలు కోల్పోవడం మనస్సును కలిచివేస్తోందని అన్నారు. మధుసూదన్ రావు కుటుంబ సభ్యుల ఆలోచనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తామని, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

google+

linkedin